- రైతులకు టోకెన్లను జారీ చేయాలి
- మిల్లులను అధికారులు వెంటనే తనిఖీలు చేయాలి
- భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉందని, అందులో సన్నరకం 2,02,862 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 35,315 మెట్రిక్ టన్నులు ఉంటాయని తెలిపారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 193 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి అదనపు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను వివరించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ గ్రేడ్ రకానికి రూ.2,369, సన్న రకంధాన్యానికి అదనంగా 500 రూపాయలు ప్రతి క్వింటాకు 2889 మద్దతు ధర నిర్ణయించబడిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టార్పాలిన్‌లు, తేమ కొలిచే యంత్రాలు, తూకపు పరికరాలు, గన్నీ సంచులు వంటి సదుపాయాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
టోకెన్ల ద్వారా కొనుగోళ్లు..
రైతులకు టోకెన్ల వ్యవస్థ ద్వారా రద్దీ నియంత్రణ చేపట్టాలని, రైతు ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్‌కి వచ్చే ఓటిపి ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. గన్నీ సంచులు ఆన్లైన్‌లో నమోదు చేసిన రైతులకు మాత్రమే ఇవ్వాలని, సంచులు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. మన జిల్లాకు పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకను నివారించేందుకు సరిహద్దుల్లో 6 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట నిఘా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే ఆన్లైన్‌లో నమోదు చేసి రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే లేదా తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సంబంధిత ఇన్‌చార్జిలపై, మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి రైతు ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులతో రావాలని సూచించారు. రైతులకు ధాన్యం విక్రయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎంఎస్‌పి ధరలు, నాణ్యత ప్రమాణాలు, సంబంధిత అధికారుల వివరాలు, సన్న వడ్లు దొడ్డు వడ్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి స్పష్టంగా ప్రదర్శించాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత గన్నీ సంచులకు ట్యాగ్, సెంటర్ నెంబర్ వేయాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు త్వరితగతిన తరలించాలన్నారు. రైతు ఐరిస్ స్కానర్ ద్వారా ధాన్యం విక్రయ ప్రక్రియ పూర్తి అవుతుందని, రైతు వ్యక్తిగతంగా అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. తూకపు బాట్లు తనిఖీ చేసి సీల్స్ వేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మిల్లులను తనిఖీ చేయండి
సీఎంఆర్ 2025-26 రబీ సీజన్‌కి సంబంధించిన డెలివరీలను సకాలంలో పూర్తి చేసేలా రైస్ మిల్లులను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, పౌర సరఫరాల అధికారి రుక్మిణి, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ్ బాబు, డీసీఓ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి బాబురావు, రవాణా శాఖ అధికారి వెంకటరమణ , తూనికలు-కొలతల అధికారి మనోహర్, మార్కెటింగ్ అధికారి నరేందర్, రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆనందరావు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


