- ఉపాధ్యాయులకు కలెక్టర్ జితేష్ పాటిల్ సూచనలు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : పిల్లల సామర్థ్యాల పెంపుదలలో ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సూచించారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో మంగళవారం జరిగిన ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి తన బాధ్యత అని పిల్లల సామర్థ్యాల పెంపుదలకు కృషి చేసేటట్లుగా ఉపాధ్యాయులను ఉత్తేజ పరచడం ప్రధానోపాధ్యాయుల బాధ్యతని, దీనిని విస్మరిస్తే విద్యార్థుల ప్రగతి అగమ్య గోచరం అవుతుందని అన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల సమాచారం యుడేస్ లో వాస్తవ స్థితి ప్రతిబింబించేటట్లుగా నమోదు చేయాలని సూచించారు.
ఉపాధ్యాయులు బోధన సామర్ధ్యాలను మెరుగు పర్చుకోవాలి
ఉపాధ్యాయులు తమ బోధన సామర్ధ్యాలు మెరుగుపరచుకునేటట్లుగా నిరంతరం ఉపాధ్యాయుల ప్రోత్సహిస్తూ ఉన్నతమైన ఫలితాలు తీసుకురావడానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా పాఠశాలలో వినూత్న కార్యక్రమాలు చేపట్టి పాఠశాల అభివృద్ధికి ఆటంకాలు లేకుండా ఉండాలంటే తల్లిదండ్రుల సమావేశాలు ప్రముఖ పాత్ర వహిస్తాయన్నారు. ఈ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించి పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యులై వారు పనిచేసే పాఠశాలలో, ఆ గ్రామంలో మంచి గుర్తింపు పొందడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ ఉద్భోదించారు. రాబోయే పదవ తరగతి పరీక్షలలో 100 శాతం ఫలితాలు సాధించడానికి ఇప్పటి నుండే ప్రణాళికల రూపొందించుకోవాలని, దీనికోసం గ్రామాల్లోని స్వయం సహాయక బృందాల సహకారంతో పిల్లలకు వివిధ పాఠ్యాంశాలలో సందేహాన్నివృత్తికై ట్యూషన్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.
అంతకుముందు జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి మాట్లాడుతూ తరగతి గదిలో ఉన్న ప్రతి విద్యార్థి వివరాలు యూడైస్ లో ముఖ గుర్తింపు హాజరులో తప్పనిసరిగా ఉండేటట్లుగా చూడాలని, నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకి అందించేటట్లుగా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజశేఖర్, సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ ఎస్కే. సైదులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్. మాధవరావు, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగ కార్యదర్శి బి.నీరజ, జిల్లా ఫైనాన్స్ అధికారి
ఏ.జగన్, సి.ఎస్.ఎఫ్ బృంద నాయకుడు నందకిషోర్, అన్ని మండలాల మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


