- పర్యాకట శాఖ మంత్రి కందుల దుర్గేష్
- 14, 15 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో మంత్రి పర్యటన
- జాతీయ మిషన్ లో ఏపీ ప్రతిపాదనలు సమర్పణ
- 50 పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధి
- ఉదయ్ పూర్ లో రెండు రోజుల పాటు జరుగనున్న సమావేశాలు
కాకతీయ, అమరావతి: దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకటనల అమలుపై రాష్ట్ర విజన్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 14, 15 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరుగనున్న జాతీయ మిషన్ లో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాట పాల్గొననున్నారు. దేశంలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల 50 పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధి, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల కల్పన కోసం ఉద్దేశించిన జాతీయ మిషన్ పై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం తరపున ప్రతినిధిగా మంత్రి కందుల దుర్గేష్ బృందం హాజరుకానుంది.
ఈ సందర్భంగా జాతీయ మిషన్ క్రింద ఆంధ్రప్రదేశ్ తరపున పర్యాటక ప్రతిపాదనలను మంత్రి దుర్గేష్ వివరించనున్నారు. ఈ చారిత్రాత్మక సమావేశంలో జాతీయ మిషన్ లక్ష్యాల సాధనకు చేయనున్న కృషి, ప్రైవేట్ పెట్టుబడులు, స్థానిక ఆర్థిక వృద్ధికి అందించే ప్రోత్సాహం, యువతకు ఉపాధి కల్పన, రాష్ట్ర పర్యాటక శాఖలో అవలంభిస్తున్న విధానాలు, పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అందిస్తున్న ప్రోత్సాహకాలు తదితర అంశాలపై కూటమి ప్రభుత్వం తీసుకోనున్న చర్యలను వెల్లడించనున్నారు. అంతేకాదు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం, పర్యాటకులకు అద్భుత అనుభవాలను కల్పించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పని చేస్తున్న తీరుపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
2030 నాటికి ఆసియాలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానాలలో ఏపీని ఒకటిగా నిలిపేందుకు తీసుకోనున్న చర్యలను సమావేశంలో వివరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రధాన పర్యాటక గమ్యస్థానాలను రాష్ట్రాల భాగస్వామ్యంతో ‘ఛాలెంజ్ మోడ్’ లో కేంద్రం అభివృద్ధి చేయనుంది. పర్యాటక సౌకర్యాలు, పరిశుభ్రత, మార్కెటింగ్ ప్రయత్నాలతో సహా సమర్థవంతమైన గమ్యస్థాన నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు అందించనుంది. ఈ సందర్భంగా పర్యాటక ప్రాంతాల మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన భూమిని రాష్ట్రాలు అందించాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ సహకారం, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు రూ.12,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు ఆకర్షించామని, రెండు రోజుల ఉదయ్ పూర్ సమావేశం అనంతరం కేంద్రం ఆమోదంతో మరో రెండు, మూడు పర్యాటక ప్రాజెక్టులు ఏపీకి వచ్చే అవకాశం ఉందని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పాటు అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.


