కాకతీయ, పినపాక: పినపాక, కరకగూడెం మండల కేంద్రాల్లో దీపావళి పర్వదినం దృష్ట్యా ఏర్పాటు చేయనున్న క్రాకర్స్ షాపులపై ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి. వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం క్రాకర్స్ షాపుల ఏర్పాటు ఖచ్చితమైన నిబంధనల మేరకు జరగాలని స్పష్టం చేశారు. క్రాకర్స్ షాపుల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. షాపులు ఓపెన్ ఏరియాలో, అనుమతి పొందిన ప్రదేశంలోనే ఉండాలని, షాప్ నిర్మాణం క్లాత్, వుడ్, టార్పాలిన్ లాంటి కాలే వస్తువులతో చేయరాదని తెలిపారు. స్మోకింగ్ నిషేధం అని స్పష్టంగా బోర్డులు ఏర్పాటు చేయాలని, స్పార్క్ వచ్చే ఎక్విప్మెంట్ వాడకూడదని సూచించారు. ప్రతీ షాప్ మధ్య కనీసం మూడు మీటర్ల గ్యాప్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని వినోద్ కుమార్ తెలిపారు. ఈ నిబంధనలు పాటించకపోతే, సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.


