కాకతీయ, జూలురుపాడు: మండలంలో కిడ్నీ వ్యాధితో సుమారుగా 50 మంది డయాలసిస్ పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నందున జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోడయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చాంద్ పాషా కోరారు. జిల్లా కేంద్రం కొత్తగూడెం వెళితే డయాలసిస్ బెడ్లు ఖాళీగా లేవని, ఖమ్మం జిల్లా కేంద్రానికి వెళ్లినా అదే పరిస్థితి నెలకొన్నదని ఆయన వాపోయారు. బెడ్ల కొరత ఉండడంతో డయాలసిస్ కోసం వెళ్లిన బాధితులను వెనక్కి పంపుతున్నారని వాపోయారు. సరైన సమయంలో డయాలసిస్ అందక మూడేళ్లలో 12 మంది చనిపోయారని, మండల వ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రిలో సేవలు పొందక మంచానికి పరిమితం అవుతున్నారని తెలిపారు. జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కోసం స్థానిక శాసనసభ్యులు రాందాస్ నాయక్ సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో డయాలసిస్ కేంద్రం కోసం కృషి చేయాలని కోరారు. ప్రజలు కిడ్నీ వ్యాధికి గురికాకుండా ఉండేంధుకు త్రాగు నీటి పరీక్షలు, హెల్త్ క్యాంపులు తదితర అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.


