- పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు
కాకతీయ, ఖమ్మం: బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్, న్యూరో సర్జన్ మారుతి గౌడ్ సోమవారం అధికారికంగా బిజెపిలో చేరారు. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బిజెపి కార్యాలయం నందు జరిగిన ఈ ముఖ్య కార్యక్రమంలో, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు మారుతి గౌడ్‌కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరితోపాటు మరో 50 మందిని కూడా పార్టీలోకి ఆహ్వానించి బిజెపి కండువా కప్పారు. ఖమ్మం నుంచి వచ్చిన డాక్టర్ మారుతి గౌడ్ చేరిక పార్టీకి, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో, మరింత బలాన్ని చేకూరుస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వైద్యరంగంలో ఆయనకున్న అనుభవం, ప్రజాసంబంధాలు పార్టీ బలోపేతానికి దోహదపడతాయన్నారు. అనంతరం మారుతి గౌడ్ మాట్లాడుతూ, బిజెపి సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం నచ్చడం వల్లే తాను పార్టీలో చేరినట్లు తెలిపారు. తన వృత్తిపరమైన అనుభవంతోపాటు, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలను వేదికగా చేసుకుంటానని, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కోశాధికారి వాసుదేవరావు, సన్నీ ఉదయ్ ప్రతాప్, నంబూరి రామలింగేశ్వరరావు, మండడపు సుబ్బారావు, ఆకుల నాగేశ్వరావు, బోయినపల్లి సురేష్, కొండా గోపి, రుద్రగాని మాధవ్, గోపి తదితరులు పాల్గొన్నారు.


