కాకతీయ, గుండాల: బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలని ఏఎంసీ డైరెక్టర్ ఊకే బుచ్చయ్య, సీనియర్ నాయకుడు మోకాళ్ళ బుచ్చయ్య హితవు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 34% ఉన్న బీసీ రిజర్వేషన్ కోటాని 23శాతానికి తగ్గించి బీసీలను గులాబీ పార్టీ మోసం చేసిందన్నారు. ఇప్పుడు హై కోర్ట్ స్టే విధించాలని వాదన చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ కి సంబంధించిన నాయకుల తరుపున న్యాయవాదేనని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పల మార్చిన కారు పార్టీ నాయకులకు అందుకే ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా బుద్ధి చెప్పారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డని కాపాడుకోలేని మీరు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులను ఏం కాపాడగలరు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల గురించి ఆలోచిస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు.


