- ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్
- మధిర రేంజర్ కు అదనపు బాధ్యతలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం జిల్లా అటవీ శాఖ లో సండ్ర కలప అక్రమ తోలకాలపై పెద్ద ఎత్తున జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్ధార్థ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో బీట్ ఆఫీసర్ శ్రీకాంత్ ను జిల్లా అటవీ అధికారి సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఫారెస్ట్ రేంజర్ నాగేశ్వరరావు పై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సువర్ణ శనివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో లేని కలపను ఉన్నట్టుగా చూపి ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు తరలించడంపై ఎఫ్ఆర్ వో విధులు దుర్వినియోగం చేయడంపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.
గతంలో కూడా ఈ రేంజర్ ఇల్లందు రేంజ్ లో పనిచేసినప్పుడు కూడా గణేష్ పౌల్డ్రి విషయం లో బలమైన ఆరోపణలు ఎదుర్కోవడంతో జన్నారానికి బదిలిచేసినా అక్కడకు వెళ్ళకుండానే చీఫ్ కన్జర్వేటర్ సహకారంతో ఖమ్మం కు బదిలీ చేయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విధంగా ఎక్కడ పని చేసినా అవినీతికి పాల్పడుతూ ఉద్యోగానికి ఎసరు తెచ్చుకున్నట్లు సొంత శాఖలొనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సంబంధిత శాఖ ఉన్నత అధికారులు నాగేశ్వరరావు పై విచారణ జరిపి విధుల నుండి తొలగించారు. అయితే ఖమ్మం రేంజ్ బాధ్యతలు మధిర రేంజర్ కు అదనంగా అప్పగిస్తున్నట్లు చీఫ్ కన్జర్వేటర్ బీమా నాయక్ మరో ప్రకటన విడుదల చేశారు.


