- మొదటి విడతలో 149 ఎంపీటీసీ, 10 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు
- ట్రైనింగ్ కు హాజరు కాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు
- స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు క్రిష్ణ ఆదిత్య
- నోడల్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు క్రిష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎన్నికల పరిశీలకులు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి సంబంధిత నోడల్ అధికారులతో గురువారం ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ఈసందర్భంగా ఎన్నికల పరిశీలకులు క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ… గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా కోర్టు కేసులు నమోదు అయ్యాయా, రీపోల్ జరిగిందా ..? వంటి అంశాలను పరిశీలించి రిపోర్టు అందించాలని ఆదేశించారు.
సిబ్బందికి అవసరమైన శిక్షణ ..
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ సంపూర్ణంగా అందించాలని అన్నారు. ప్రతి అధికారి ఎన్నికల నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యేలా చూడాలని అన్నారు.
పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, పోలింగ్ ప్రక్రియ వెబ్ కాస్టింగ్ లేదా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించేలా చూడాలని అన్నారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా చూడాలని అన్నారు. బ్యాలెట్ పేపర్ ముద్రణకు చర్యలు తీసుకోవాలని, అవి ఎట్టి పరిస్థితుల్లో బయటకు పోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలన్స్ బృందాలు మరింత విస్తృతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో మొదటి విడతలో 149 ఎంపీటీసీ, 10 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ అధికంగా ఉంటుందని, అధికారులు నిబంధనల పట్ల అవగాహనలేని పక్షంలో విధుల నిర్వహణ కఠినతరం అవుతుందని అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది తమ హక్కులు, బాధ్యతలు సంపూర్ణంగా తెలిసి ఉండాలని, ప్రతి రూల్ పొజిషన్ పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి రెండు దఫాలుగా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా అందించామని కలెక్టర్ తెలిపారు. ట్రైనింగ్ కు హాజరు కాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రతి మండలానికి ఒకటి చొప్పున మొత్తం 20 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, 15 స్టాటిక్ సర్వీసెస్ బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఉన్న 713 పోలింగ్ లొకేషన్స్ లలో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని అన్నారు.
జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ అన్నారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉన్న భవనాలను పరిశీలించామన్నారు. బ్యాలెట్ పేపర్ ను పకడ్బందీగా ముద్రణ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. మీడియా సెంటర్ ఏర్పాటు చేసి ఎప్పటి కప్పుడు ఎన్నికలకు సంబంధించిన విషయాలు మీడియాకు తెలిసేలా చర్యలు చేపట్టామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిపోర్టింగ్ పక్కాగా జరిగేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా కంట్రోల్ రూమ్, అవసరమైన అకౌంటింగ్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్సు, వీడియో సర్వేలెన్సు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు.
సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య , డిఆర్ఓ ఏ. పద్మశ్రీ, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, డిఆర్డిఓ సన్యాసయ్య, డిపిఓ ఆశాలత, ఆర్టిఓ వెంకట రమణ, సిపిఓ ఏ. శ్రీనివాస్, జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్, డి.వై.ఎస్.ఓ. సునీల్ రెడ్డి, డిసిఓ గంగాధర్, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి జి. పుల్లయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


