గడ్డి మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..
ప్రియుడు మృతి, ప్రియురాలి పరిస్థితి విషమం..
కాకతీయ, వరంగల్ బ్యూరో :జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రేమజంట గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రియుడు మారపాక అన్వేష్ (26) చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ప్రియురాలు గడ్డం పావని (22) హన్మకొండ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రేమజంట ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాటికొండ గ్రామంలో ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.


