- జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ప్రజలకు నిర్విరామంగా సేవలు అందించిన సిబ్బందికి జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారిణి, కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెప్టెంబర్ లో పదవీ విరమణ పొందిన సిబ్బంది కోసం సోమవారం ప్రజావాణి అనంతరం ఏర్పాటు చేసిన రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసి అభివృద్ధి శాఖ పరిధిలో సహాయ బీసి అభివృద్ధి అధికారిగా పని చేసిన ఎం.ఈదయ్య, వెటర్నరీ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ జి.సావిత్రి పదవీ విరమణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ మాట్లాడుతూ పదవీ విరమణ జీవితంలో చాలా కీలకమైన ఘట్టమని, మనకు గుర్తింపు ఉద్యోగం నుంచి లభిస్తుందని అన్నారు. 30 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ రంగంలో సేవలు అందించడం చాలా గొప్ప విషయమని, ప్రజలకు వివిధ రంగాలలో దశాబ్దాల కాలంగా సేవలు అందించి నేడు పదవి విరమణ పొందుతున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ పొందిన ఎం. ఈదయ్య మాట్లాడుతూ బీసీ అభివృద్ధి శాఖలో హాస్టల్ సంక్షేమ అధికారిగా విధులలో చేరి నేడు సహాయ బిసి అభివృద్ధి అధికారిగా ఐదేళ్ల నుంచి పని చేస్తూ నేడు పదవి విరమణ పొందడం సంతోషంగా ఉందన్నారు.
విధి నిర్వహణలో తనకు సహకరించిన అధికారులకు, తోటి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. వెటర్నరీ శాఖలో ఆఫీస్ సబార్డినేట్ గా పదవీ విరమణ పొందిన సావిత్రి మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా తాను వెటర్నరీ శాఖలో పని చేస్తున్నానని, తనకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డిఆర్ఓ వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి, వెటర్నరీ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


