- బలమైన స్థానాల్లో సీపీఎం ఒంటరిగా పోటీ
- పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: బిజెపికి వ్యతిరేకంగా కలిసివచ్చే వామపక్ష ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో స్థానిక ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటామని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చవెంకటేశ్వర్లు వెల్లడించారు. సోమవారం స్థానిక మంచికంటి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కొంత గందరగోళంగా ఉందని అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ఆధారంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలియజేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ కూడా గందరగోళానికి దారితీసిందని ఆరోపించారు. ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికలకు ఒకే షెడ్యూల్ ఇవ్వడం వలన గందరగోళం నెలకొనే పరిస్థితి ఉందని దీనిపై పునరాలోచించి ఒక ఎన్నిక పూర్తయిన తర్వాత మరొక ఎన్నికకు వెళ్లాలని ఆయన సూచించారు.
బీసీ రిజర్వేషన్ అంశం కోర్టులో ఉన్నప్పటికీ తీర్పు వెళ్ళడైన సందర్భంలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలకు తమ సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. బీజేపీని ఓడించడానికి కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో ముందుకు వెళ్తామని అన్నారు. బీజేపీతో అధికార భాగస్వామిగా ఉన్న ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదని స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లాలో తాము 120 సర్పంచ్, 80 ఎంపీటీసీ, 8 ఎంపీపీ, 6 జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటున్నామని ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే పార్టీతో కలిసి పోటీ చేస్తామని లేకుంటే తమకు బలం ఉన్న స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన తెలిపారు.
పొత్తు ఉన్నా లేకున్నా సిపిఎం బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేస్తుందని, పార్టీ విధానం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎన్నికలు సాధనంగా ఉపయోగించుకుంటామన్నారు. గతంలో సిపిఎం గెలిచిన స్థానిక సంస్థలను ఆదర్శంగా తీర్చిదిద్దామని ఆదర్శ గ్రామపంచాయతీల అవార్డులు కూడా పొందామని తెలిపారు. ఎన్నికలో గ్రామాల అభివృద్ధికి అంకితమై పని చేస్తున్న సిపిఎంకు పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కే.బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


