ఈ ఖమ్మం కు ఏమైంది
రోజు రోజుకి పెరుగుతున్న రౌడీ షీటర్ల ఆగడాలు..
చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలం
రౌడీలకు అంటకాగుతున్న అధికారపార్టీ నాయకులు,ఓ జర్నలిస్ట్.
భయాందోళనలో ఖమ్మం ప్రజలు
సీపీ దృష్టి సారిస్తేతప్ప వారి ఆగడాలు ఆగేలా లేవు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంకి ఏమైందనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేరాలను తగ్గించేందుకు ఆనాటి ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేయడంతో కథ అడ్డం తిరిగి చివర ఆఖరుకు పోలీసులపైనే నేరస్తులు తిరగబడే పరిస్థితి వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి రాష్ట్రంలో నేరాల నియంత్రణ కోసం చర్యలు చేపట్టింది. కానీ ఖమ్మం కేంద్రంలో దీనికి భిన్నంగా పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. స్థానిక మంత్రి ఆదేశాలతో ప్రభుత్వం ఏర్పడ్డ మొదట్లో నేర నియంత్రణ కోసం జిల్లా సిపి ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపట్టారు. కాగా గడిచిన కొన్ని నెలలుగా రోజురోజుకి ఖమ్మం నగరంలో అల్లర్లు పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
దీనిలో ఎక్కువగా రౌడీషీటర్లు, మాజీ రౌడీ షీటర్లు జోక్యం కలిగించుకోవడం వల్లనే ల్యాండ్ సెటిల్మెంట్లు, ఆర్థిక సెటిల్మెంట్లు, వంటివి కాక సుఫారీ తీసుకొని మనుషుల ప్రాణాలు తీయడం వంటి నేరాలకు ఈ రౌడీషీటర్లు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఖమ్మంలోని ఇద్దరు రౌడీ షీటర్ల పై ఖమ్మం టూ టౌన్ లో ఒక పీడీ యాక్ట్, అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక పీడీ యాక్ట్ నమోదు చేసి ఆ నేరస్తులను చర్లపల్లి జైలుకి పంపడం జరిగింది. ఇంత జరిగిన ఖమ్మంలో కొంతమంది రౌడీషీటర్లు గ్రూపులుగా ఏర్పడి సామాన్య ప్రజానికంపై దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కోవలోకే దసరా పండుగ రోజు జరిగిన ఘటన వస్తుందని ప్రజలు వాపోతున్నారు. శ్రీనగర్ కాలనీకి చెందిన రౌడీషీటర్ గణేష్ నాయుడు పై బద్రుల్ల.అనే మాజీ రౌడీ షీటర్, జెకె మహేష్ అనే రౌడీషీటర్ దాడికి పాల్పడుతూ ఓ విలేఖరి కి ఆప్తులుగా చెప్పుకుంటూ దౌర్జన్యం చేసినట్లు బాధిత రౌడీషీటర్ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియా లో విస్తృతంగా చక్కర్లు కొట్టడంతో ఈ కేసు పోలీసులకు ఓ సవాలుగా నిలిచిందని చెప్పుకోవచ్చు.
జెకె మహేష్ అనే రౌడీషీటర్ ఇల్లందు పట్టణం నుండి వెలివేయబడడం జరిగింది. ఇల్లందు పట్టణంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన పోలీసులకు సవాలుగా మారడంతో అతనిపై పోలీస్ ప్రకటన చేయడంతో భయపడ్డా మహేష్ తనకు తానుగానే గంజాయి కేసులో నిండుదురుగా చేరి అప్రూవల్ గా మారి ప్రాణాలను నిలుపుకొని ఇల్లందు పట్టణం విడిచి హైదరాబాద్, ఖమ్మం లో స్థావరాలు ఏర్పర్చుకునట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రౌడీషీటర్లకు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అండదండలు మెండుగా ఉండడమే కాక ఓ రిపోర్టర్ కూడా వారికి సహకరిస్తూ తన పనులు కూడా చక్కదిద్దుకుంటున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. ఇప్పటికే ఆ జర్నలిస్టుపై ఖమ్మం సీపీ కండిషన్లు జరిచేయగా లెక్క చేయని ఆయన అక్రమాలకు పాల్పడుతున్న వారితో దోస్తీ కట్టి జర్నలిజానికి మాయని మచ్చగా ఏర్పడ్డట్లు తోటి జర్నలిస్టులు విమర్శలు గుప్పిస్తున్నారు. వారితో జర్నలిస్ట్ చాటుమాటు సమావేశాలు చేస్తూ వాటిని ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్లో అప్లోడ్ చేయించి సెటిల్మెంట్లు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనాపటికి ప్రశాంతంగా ఖమ్మం నగరం ఉండాలని స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరావు వివిధ వేదికలపై ప్రకటనలు చేసినప్పటికీ అదే పార్టీలోని కొందరు నాయకులు ఇలాంటి నేరాలుకు పాల్పడుతున్న వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
సిపి సునీల్ దత్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు కటోరంగ పనిచేస్తున్నప్పటికీ కొంతమంది పోలీస్ అధికారుల వల్ల ఆ శాఖకు మచ్చ ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పులు చేస్తూ జబ్బలు చరుచుకునే వాళ్లు ఉన్నంతకాలం ఇలాంటి నేరస్తులకు ఆగడాలకు అంతులేకుండా పోతుందని వాపోతున్నారు. కాబట్టి సిపి సునీల్ దత్ నేరాలకు పాల్పడేవారు, వారిని ప్రోత్సహించే వారిని ఎవ్వరిని వదలకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


