కాకతీయ, తెలంగాణ బ్యూరో: తిరుమలలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో తిరుమల వాతావరణం అకస్మాత్తుగా మారింది. సాధారణంగా ఉదయం చల్లగా ఉండే తిరుమల గిరులు, ఈ అకాల వర్షంతో మరింత చల్లబడ్డాయి. చలి తీవ్రత పెరగడంతో భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురయ్యినా, కొండ ప్రాంతం ఇచ్చే తాజాదనం, ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించారు.
భారీ వర్షం కారణంగా నాలుగు ప్రధాన మాడవీధులు పూర్తిగా నీటమయమయ్యాయి. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు, దర్శనం అనంతరం బయటకు వచ్చినప్పుడు వర్షం కారణంగా తడిపి పోయారు. వసతి గృహాలకు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించిన భక్తులు కొన్ని ఇబ్బందులకు గురయ్యారు. అయినప్పటికీ ఈ అకస్మాత్తు వర్షం వలన ఏర్పడిన చల్లదనాన్ని భక్తులు పూర్తిగా ఆస్వాదించారు. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా ఈ వర్షాకాలంలో పెద్ద వర్షాలు లేవు. కానీ కొండ ప్రాంతమైన తిరుమలలో విరివిగా వర్షం కురుస్తోంది.
తిరుమల కంటే దిగువన ఉన్న తిరుపతి పట్టణంలో వర్ష ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. గత ఎనిమిది గంటలుగా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులుగా మారి, రైల్వే అండర్ బ్రిడ్జులు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ప్రజల రాకపోకలకు సీరియస్ అంతరాయం ఏర్పడింది.
ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల దగ్గర నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, భక్తులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్ష తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అప్రమత్తత చర్యలు తీసుకుంటూ చిన్న వాహనాలను రోడ్లపైకి అనుమతించకుండా, భారీ వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. వర్షపు నీటిలో చిక్కుకుని కొన్ని వాహనాలు ఆగిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పరిస్థితి తీవ్రంగా ఉండంతో తిరుపతిలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమలకు వచ్చే భక్తులు జాగ్రత్తగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.


