కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా రాజకీయ చర్చలు, అభ్యర్థుల ఎంపికపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పల్లె వాతావరణం పండుగలా మారి ఎన్నికల సందడి మొదలైంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల అర్హతలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారు పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించబడ్డారు. ఈ చట్టం 1995 మే 31 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే ఆ తేదీ తరువాత ముగ్గురికి మించిన పిల్లలు కలిగినవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కోల్పోయారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలను మాత్రం చట్టం అనుమతిస్తోంది. 1995 మే 31 నాటికి ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నవారు, చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కవలలు పుట్టిన వారు, ఒక కాన్పులోనే ముగ్గురు పిల్లలు పుట్టిన వారు పోటీ చేయడానికి అనుమతించబడ్డారు. ఈ నిబంధన తెలంగాణలో ఇప్పటికీ అమల్లో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 2024 డిసెంబర్ 19 నుంచి ఈ పరిమితిని ఎత్తివేశారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో పల్లెల్లో పండుగలా సందడి మొదలైంది. విజయదశమి సమయానికే ఎన్నికల ప్రకటన రావడంతో దానిని ‘ఎన్నికల పండగ’గా పేర్కొంటున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించడంతో అభ్యర్థుల పేర్లపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంలో మునిగిపోయాయి. అభ్యర్థుల సామాజిక సమీకరణం, ఆర్థిక స్థితి, స్థానిక బలాబలాలు వంటి అంశాలను పరిశీలిస్తూ అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. మరోవైపు, ఆశావహులు పండుగ వేళల్లో బలప్రదర్శనకు సన్నద్ధమవుతున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, విందులు, రావణవధ వేడుకలు కూడా ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చుతున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. అక్టోబర్ 9 నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. రెండో విడత నామినేషన్లు అక్టోబర్ 13 నుంచి స్వీకరించనున్నారు. తొలి విడత పోలింగ్ అక్టోబర్ 23న, రెండో విడత పోలింగ్ అక్టోబర్ 27న జరగనుంది. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించబడతాయి. అక్టోబర్ 17న తొలి విడత నోటిఫికేషన్ వెలువడుతుంది. అక్టోబర్ 17 నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరించి, అక్టోబర్ 31న పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడత నోటిఫికేషన్ అక్టోబర్ 21న విడుదల అవుతుంది. అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 4న రెండో విడత పోలింగ్ జరుగుతుంది. మూడో విడత నోటిఫికేషన్ అక్టోబర్ 25న జారీ చేసి, అక్టోబర్ 25 నుంచి 27 వరకు నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 8న పోలింగ్ నిర్వహించనున్నారు.
ఎన్నికల ప్రకటన వెలువడటంతో తెలంగాణ పల్లెల్లో రాజకీయ జోరంతా కొత్త ఉత్సాహాన్ని నింపింది. అభ్యర్థుల ఎంపిక, పండుగ వేడుకలు, పార్టీల వ్యూహాలు కలిపి గ్రామాల్లో ఎన్నికల వాతావరణం పండగలా మారింది. రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల తుఫాను రాష్ట్ర రాజకీయ రంగాన్ని మరింత వేడెక్కించడం ఖాయం.


