- రోజుకు 2.25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలి
- ఏరియా జీఎంలకు సంస్థ సీఎండీ ఎన్.బలరాం ఆదేశం
కాకతీయ, కొత్తగూడెం రూరల్: ఈ ఆర్థిక సంవత్సరం సింగరేణి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి రోజుకు 2.25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సంస్థ ఛైర్మన్ ఎండీ ఎన్.బలరాం సూచించారు. బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అన్ని ఏరియాల జీఎంలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రోజుకు 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించాలన్నారు. మూడు నెలలుగా కురిసిన భారీ వర్షాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో 91 శాతం ఉత్పత్తి లక్ష్యాలను, 93 శాతం రవాణా లక్ష్యాలను మాత్రమే సాధించామని, మిగిలిన ఆరు నెలల్లో ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
గత రెండు నెలల్లో సింగరేణి సంస్థ మనుగడకు, ఉజ్వల భవిష్యత్ కు దోహదపడే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ముఖ్యంగా కీలక ఖనిజాల అన్వేషణ రంగంలోనూ కంపెనీ అడుగు పెట్టిందని గుర్తు చేశారు. సింగరేణి అంతర్జాతీయ కార్యాలయం నిర్మాణం కోసం ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ ఒక్క ఉద్యోగిలోనూ పని సంస్కృతిని మరింత మెరుగుపరిచేందుకు ప్రతీ ఒక్కరూ ప్రయత్నించాలని, కంపెనీ మనుగడ కోసం ప్రతీ ఉద్యోగి ప్రతీ షిఫ్ట్ లో 8 గంటలు పనిచేయాలన్నారు.
రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంచినప్పుడే బొగ్గు రంగంలో మన మనుగడ ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమలరావు, హైదరాబాద్ నుంచి ఈడీ కోల్ మూవ్మెంట్ బి.వెంకన్న, జీఎం(కో ఆర్డినేషన్, మార్కెటింగ్)టి.శ్రీనివాస్ పాల్గొనగా అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలు పాల్గొన్నారు.


