- 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ముందుకు..
- గ్రామలకు చేరిన సంక్షేమ పథకాలే బలం
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాకతీయ, కూసుమంచి: మొదటి విడతలోనే పాలేరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయని, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాల్లోని ప్రతీ పార్టీ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. కూసుమంచిలోని పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలాల వారీగా సోమవారం ఆయన పార్టీ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ….ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీఓ జారీ చేసి ఎన్నికలకు సిద్ధమైందన్నారు. ఆ జాబితా ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇప్పటికే రిజర్వేషన్ అనే జాబితా వెలువడిందని, ప్రభుత్వం ఇచ్చిన జీఓను కొందరు హైకోర్టులో సవాలు చేశారని, అక్టోబర్ 8న హైకోర్టు తీర్పు వెలువడనుందన్నారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
గడిచిన 21 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని మంత్రి గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు ఇలా గ్రామాలన్నింటికీ చేరాయని వివరించారు. “ఈ పథకాలు అభ్యర్థుల విజయానికి ప్రధాన బలం అవుతాయి” అని అన్నారు. గ్రామాల్లో విభేదాలు ఉన్నా వాటిని చర్చల ద్వారా పరిష్కరించి ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు.
అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కోసం ప్రతి మండలానికి తొమ్మిది మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఒకే గ్రామం నుండి అనేక మంది ఆశావహులు ఉన్నప్పుడు గెలుపు అవకాశాలు, పార్టీపై విధేయతను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. రిజర్వేషన్ల కారణంగా పోటీకి దూరమైన వారికి వేరే అవకాశాలు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవు” అని మంత్రి పొంగులేటి హెచ్చరించారు.


