- బన్న అయిలయ్యకు మన కాలపు జాషువా అవార్డు అందజేత
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: తెలుగు సాహిత్యంలో నిత్య స్మరణీయుడు మహాకవి గుర్రం జాషువా అని ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు గిరిజా మనోహరరాజు అన్నారు. ఆదివారం రాత్రి మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా జాషువా సాహిత్య వేదిక ఖమ్మం అధ్యక్షుడు ప్రముఖ కవి, విద్యావేత్త మువ్వా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రముఖ కవి, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు బన్న అయిలయ్య కు మన కాలపు జాషువా అవార్డు ను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాషువా జీవితానికి అయిలయ్య జీవితానికి దగ్గర పోలికలు ఉన్నాయన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో నలభై ఏళ్లుగా కవిగా పరిశోధకుడిగా, పరిశోధనా మార్గదర్శిగా అనేక లోతైన పరిశోధనలు చేయించారని తెలిపారు. అయిలయ్య మాట్లాడుతూ జాషువా అవార్డు తీసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఇల్లందు, తొర్రూరు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు డా.వై.చిన అప్పయ్య, డా.బి.రాములు, కొత్తపల్లి గురుప్రసాద్, పంజాల అయిలయ్య, కిన్నెర వెంకటేశ్వర్లు, వురిమళ్ల సునంద, డా.బాలునిర్మల, జాషువా సాహిత్య వేదిక కార్యదర్శి పగిడిపల్లి వెంకటేశ్వర్లు, ఖమ్మం కవులు, తదితరులు పాల్గొన్నారు.


