- 15 శాతం లాభాల బోనస్ ఇవ్వాలి
- కోల్ ఇండియా వేతనాలు చెల్లించాలి
కాకతీయ, కొత్తగూడెం రూరల్: కాంట్రాక్ట్ కార్మికులపై సింగరేణి యాజమాన్యం వివక్షతను వీడాలని, వారికి
లాభాల బోనస్ 15 శాతం ఇవ్వాలని ఐఎఫ్ టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే.సీతారామయ్య డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టియు) సింగరేణి ఓబి ఆపరేటర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, సింగరేణి సులాబ్ వర్కర్స్ యూనియన్, మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జిఎం కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం ఒకే కుటుంబం అంటూనే కాంట్రాక్టు కార్మికుల శ్రమను కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ ఉందని వివక్షతతో పేద కాంట్రాక్టు కార్మికుల కడుపులు కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రకటించిన బోనస్ అసంతృప్తిగా ఉందని మండిపడ్డారు. సింగరేణి సాధించిన రూ.6930కోట్ల లాభాల నుండి 15 శాతం వాటాను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు 2013నుంచి కోల్ ఇండియా వేతనాలు(హై పవర్ వేతనాలు)చెల్లించాల్సి ఉందన్నారు. హెచ్ పిసి వేతనాలు చెల్లించక పోవడం వల్ల కాంట్రాక్టు కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందని, సింగరేణి 28 ఏండ్లుగా లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ దీనికి కార్మికులు అధికంగా శ్రమ చేయడమేనని ఇందులో కాంట్రాక్టు కార్మికుల పాత్ర ఎంతో కీలకంగా ఉందని అన్నారు.
కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కోల్ ఇండియాలో అమలుచేస్తున్న హై పవర్ కమిటీ వేతనాలను సింగరేణిలో అన్నివిభాగాల కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలని, సులభ్ కార్మికులకు కనీస వేతనాలు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను అమలు చేయించాలన్నారు. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 26 రోజుల పని కల్పించాలన్నారు. బొగ్గు ఉత్పత్తిలో పాల్గొంటున్న కాంట్రాక్టు కార్మికులకు 11వ వేతన ఒప్పందం బేసిక్ ను అమలు చేయాలన్నారు.
సింగరేణి అన్ని ఏరియాలలో ఖాళీగా ఉన్న కంపెనీ క్వార్టర్స్ ను కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలపై వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి ఎన్.సంజీవ్, మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు శరత్, సులాబ్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు రాజేశ్వరి, ఉలికి బాబా, వెంకన్న, లక్ష్మి, అవినాష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


