కాకతీయ, కొత్తగూడెం : భగత్ సింగ్ కలలు కన్న సమసమాజ స్థాపనకు యువత మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లిక్కి బాలరాజు, కాళంగి హరికృష్ణ పిలుపునిచ్చారు. కొత్తగూడెంలో జరిగిన భగత్ సింగ్ జయంతి కార్యక్రమాలలో వారు పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే చిరునవ్వుతో ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు.
స్వాతంత్ర్యం పట్ల స్పష్టమైన అవగాహనతో భగత్ సింగ్ పోరాటం చేశాడని అన్నారు. నేటి పాలకులు స్వాతంత్ర దినోత్సవ స్పూర్తికి విగాథం కలిగిస్తూ ఈ దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెడుతూ నూటికి 90 శాతం మంది ప్రజలను పేదరికంలోకి నెట్టివేసే విధానాలు అవలంబిస్తున్నారని వారు ఆరోపించారు. కులమత, ప్రాంత రాజకీయాలు పెరిగిపోయాయని, ఈ రాజకీయాల వల్ల యువత పెడదారి పడుతున్నారని, అందుకే స్వచ్ఛమైన రాజకీయాల కోసం భగత్ సింగ్ స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలని వారు పిలుపునిచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల కోసం కొట్లాడేందుకు యువత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు విజయ్, మోహన్ సింగ్, ఉప్పెర్ల ప్రశాంత్, సతీష్, వేణు తదితరులు పాల్గొన్నారు.


