కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ రూ.20 వేలు ఇవ్వాలి
బోనస్ పెంపుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తాం
సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు
కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ విషయంలో సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.20 వేలు బోనస్ ప్రకటించాలని లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ శుక్రవారం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాలో జేఏసీ రాష్ట్ర నాయకులు బి.మధు, షేక్ షావలి, మల్లెల రామనాథం, గూడేల్లి యాకయ్య, కరుణాకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ప్రకటించిన లాభాల వాటాలో 36 వేల మంది కాంట్రాక్టు కార్మికులను దగా చేసిందని కేవలం రూ.5వేలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు.
కోల్బెల్టు ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపడం లేదో సమాధానం చెప్పాలన్నారు. లాభాల బోనస్ లో రూ.20 వేలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. బోనస్ చట్టం ప్రకారం చూసినా లాభాల్లో ఉన్న కంపెనీలు కాంట్రాక్ట్ కార్మికులకు 20 శాతం వరకు బోనస్ చెల్లించాలన్నారు. గతంలో అనేకమార్లు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై సానుభూతి పలికిన భట్టి విక్రమార్క గానీ, జీతాలు పెంచుతామని హామీలు ఇచ్చి గెలిచిన కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు గానీ ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సమంజసం కాదన్నారు. నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 20 నెలలు గడిచినప్పటికీ నేటికీ వేతనాలు పెంచక పోవడం, వీరి శ్రమతోటి వచ్చిన లాభాల నుండి కూడా సముచిత స్ధాయిలో ఇవ్వకపోవడంతో కాంట్రాక్టు కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి అలుముకొంటుందని అన్నారు.
గత సంవత్సరం కాంట్రాక్ట్ కార్మికులతో పాలాభిషేకాలు చేయించుకున్న ఎమ్మెల్యేలు స్పందించాలని డిమాండ్ చేశారు. లాభాల వాటాను పునః సమీక్షించి కాంట్రాక్ట్ కార్మికులకు సముచితమైన లాభాల వాటాను ఇప్పించాలని వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. లేనియెడల బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు భూక్యా రమేష్, సతీష్, తాండ్ర విజయ్, రాజశేఖర్, నునావత్ విజయ్, గుగులోత్ సక్రాం, మాతంగి రాజేష్, భాస్కర్, రాణి, సునీల్, రాధ తదితరులు పాల్గొన్నారు.


