కాంట్రాక్ట్ కార్మికులకు
లాభాల బోనస్ పెంచాల్సిందే…
కేవలం రూ.500 పెంచి చేతులు దులుపుకోవడం సరికాదు
కార్మికులను దగా చేసిన యాజమాన్యం.. కాంగ్రెస్ ప్రభుత్వం
నేడు ఎమ్మెల్యే ఆఫీస్ ముందు జరిగే ధర్నాలో పాల్గొనండి
కార్మికులకు సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ పిలుపు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: సింగరేణివ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ పెంచాల్సిందేనని, కేవలం రూ.500 పెంచి చేతులు దులుపుకోవడం సరికాదని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు అధిక శాతం లాభాల బోనస్ ఇవ్వడంతోపాటు వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ నిరసన కార్యక్రమంలో కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం జరిగిన సమావేశంలో జేఏసీ నాయకులు మల్లెల రామనాథం, భూక్య రమేష్, గుడెల్లి యాకయ్య మాట్లాడారు. కార్మికులకు జరిగిన అన్యాయంపై కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు స్పందించి జీతాలు లాభాల బోనస్ పెంపుదలలో చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా విషయంలో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులను దగా చేసిందని, కేవలం 500 రూపాయలు పెంచి చేతులు దులుపుకుందని, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల ప్రస్తావన చేయలేదని విమర్శించారు. లాభాల బోనస్ లో 20 వేలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని దశలవారీ ఆందోళన పోరాటాల్లో భాగంగా ఈనెల 26వ తేదీన కొత్తగూడెం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు గూగులోత్ సక్రాం, మాతంగి రాజేష్, భాస్కర్, రాణి, రవి, తాండ్ర విజయ్ తదితరులు పాల్గొన్నారు.


