కనుల విందుగా బ్లాక్ బెర్రీ అందాలు
ఇసుక దిబ్బల్లో ఆటలు.. పిల్లకాలువలో ఈతలు
తాడ్వాయి అడవుల్లో అబ్బురపరిచే పర్యాటకం
కాకతీయ, ములుగు : ములుగు జిల్లా పర్యాటక రంగంలో దూసుకుపోతున్న క్రమంలో మరో అద్భుత పర్యాటక స్థలం బ్లాక్ బెర్రీ ములుగు జిల్లా పర్యాటకానికి ఊతమిచ్చేలా అధికారులు రూపొందించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలములోనీ మొండ్యాల తొగు సమీపం లోనీ బ్లాక్ బెర్రీ దీవిని పర్యాటకులను ఆకర్షించే విధంగా అద్భుతమైన రీతిలో ఐదు ఎకరాల స్థలంలో పర్యాటకులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు.

ప్రకృతి అందాల బ్లాక్ బేరి ఐలాండ్..
ములుగు జిల్లా లో పర్యాటక ప్రదేశాలుగా గుర్తింపు పొందిన లక్నవరం,రామప్ప,బొగత జలపాతం,లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, ఆదివాసులు జాతర మేడారం లాంటి పర్యాటక ప్రాంతాలతో పాటు పర్యాటకులకు ప్రకృతి అందాలతో కనువిందు చేయడానికి నాలుగువైపులా పారే జలగలంచ వాగు మధ్య ఇసుక తిన్నెలతో ఐదెకరాల విస్తీర్ణం, సాయంత్రం చుట్టూ ఉన్న అడవి నుంచి వచ్చే చల్లని గాలులు ఇలా సేద తీరటానికి పర్యాటకులు ఆహ్లాదకరంగా గడపడానికి విశేషాలు ఎన్నో ఉన్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది.

పర్యాటకులకు అణువుగా తీర్చిదిద్దుతున్న అధికారులు….
అందమైన ద్వీపంలో గడపాలని పర్యాటకుల కోసం దేశ విదేశాల్లో ఉండే సౌకర్యాలతో బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను అధికారులు తీర్చిదిద్దుతున్నారు.పర్యాటకులు రాత్రి బస చేసేందుకు ఇద్దరు,ముగ్గురు,నలుగురు ఉండేలా ఎవరి అనుకూలతను బట్టి వారు ఉండేలా దాదాపు 50 గుడారాలను సిద్ధం చేయడంతో పాటు పర్యాటకులకు కావలసిన భోజనాన్ని అక్కడే వండి, వడ్డించేందుకు అత్యాధునిక వంటశాలతో పాటు వంట వారిని ఏర్పాటు చేశారు. రాత్రి విడిది చేసే పర్యాటకుల కోసం సోలార్ విద్యుత్తు సదుపాయం కల్పించి చుట్టూ అందమైన విద్యుత్తు దీపాలు, చుట్టూ రక్షణ కోసం కంచె, అడవి అందాలు పై నుండి చూసేందుకు ఎత్తయిన మంచే ఏర్పాటు చేశారు.
ఆహ్లాదంగా గడిపేందుకు ఏర్పాట్లు…
అడవి మధ్యలో ఏర్పాటు చేసే బ్లాక్ బెర్రీ ఐలాండ్లో పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేందుకు గేమ్స్ జోన్, ఇసుక లో బీచ్ వాలీ బాల్ తరహా కోర్టు, షటిల్ కోర్ట్, చిన్నారులు, పెద్దలు ఆడుకోవడానికి కబడ్డీ, ఖోఖో లాంటి ఆటలతోపాటు వాగులో ఫిషింగ్ చేసుకుంటూ చిన్న పెద్ద అందరూ కలిసి జలగలంచ వాగులో ప్రవహించే నీటిలో ఆటవిడుపుగా గడిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరో రెండు మూడు రోజుల్లో పర్యాటకులను అలరించేందుకు ఈ దీవి సిద్ధమవడంతో పాటు అందరికీ అందుబాటులో ధరలు కూడా నిర్ణయించే అవకాశం ఉంది.


