- విచ్చలవిడిగా మట్టి తవ్వుతున్న మాఫియా
- యథేచ్ఛగా పునాదిరాయి తరలింపు
- గుట్ట స్థలాలను ఆక్రమించి పంట పొలాలు
- చోద్యం చూస్తున్న మైనింగ్, రెవెన్యూ శాఖలు
కాకతీయ, కొత్తగూడెం రూరల్: జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల గుట్టలను కొందరు ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారు. గుట్టల సంపద వెలికితీస్తూ దానిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని జూబ్లీపురం గ్రామ సమీపంలోని కారుకొండ గుట్టను మాఫియా గ్యాంగ్ తవ్వేస్తున్నారు. రూ.లక్షల విలువ చేసే మట్టిని దోచుకెళ్తున్నారు. ఇలా అక్రమార్కులకు మట్టి వ్యాపారం కాసుల వర్షం కురిపిస్తుండగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో ఉదయం, రాత్రి వేళల్లో నిత్యం అక్రమంగా జేసీబీల సాయంతో మట్టి తవ్వకాలు చేపట్టి ట్రిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. కొందరు చోటా, బడా నాయకులు, వారి అనుచరులు మట్టి గుట్టలను పిండేస్తున్నారు.
యథేచ్ఛగా తరలింపు
గుట్ట సంపదను కాపాడాల్సిన మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. జేసీబీ యంత్రాలు పెట్టి టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. వాణిజ్య సముదాయాలు, ప్రైవేట్ భవనాలు, రియల్ వెంచర్స్, షాపింగ్ కాంప్లెక్స్, గోదాం నిర్మాణాలకు తరలిస్తూ.. టిప్పర్‌కు రూ.6వేల నుంచి రూ.8వేల వరకు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు.
లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ, జూబ్లీపురం, శేషగిరినగర్ తదితర ప్రాంతాల్లో మట్టి గుట్టలను విచ్చలవిడిగా తవ్వకాలు చేపడుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులు ఇష్టానుసారంగా గుట్టలను తవ్వేస్తున్నారు. పెద్దఎత్తున ప్రకృతి సంపదను కొల్లగొడున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆయాశాఖల అధికారులు స్పందించి గుట్టల సంపదను కాపాడాలని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


