- రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- ఆరెంపులలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
- అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పొంగులేటి
కాకతీయ ఖమ్మం ప్రతినిధి: పేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా రాష్ట్ర ప్రభుత్వంచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో ఆయన పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఆరెంపుల గ్రామంలో ఇండ్లు పూర్తి చేసిన జెల్ల విజయ కుమారి, చెన్నబోయిన నరేష్, షేక్ నాగుల్ పాషా, చిర్ర రాజ్యం, సమర్థపు మమత, షేక్ రంజాన్ పాషా లకు చెందిన ఇందిరమ్మ ఇళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు చిర్ర రాజ్యం ఇంట్లో మంత్రి, కలెక్టర్, సిపిలు భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అధికారం, స్వార్థం కోసం కాకుండా పేదల ఆత్మగౌరవం కోసం ఉపయోగపడాలనే తాపత్రయంతో రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖను తనకు కేటాయించారన్నారు. వైఎస్ఆర్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తే, ప్రత్యేక తెలంగాణలో గత పాలకులు హౌసింగ్ కార్పోరేషన్ ను రద్దు చేశారని మంత్రి విమర్శించారు. పేద ప్రజలకు భరోసా, ధైర్యం అందించేలా ఇందిరమ్మ ఇండ్లను ప్రజా ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు. పాలేరు నియోజకవర్గంలో నేడు గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల లోపు మరో మూడు విడతలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఆరెంపుల గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు క్రింద చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో నేడు 6 గృహ ప్రవేశాలు మంత్రి చేతుల మీదుగా జరగడం సంతోషకరమని అన్నారు. ఖమ్మం జిల్లాలో మొదటి విడత క్రింద 16,300 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైతే 14 వేలకు పైగా ఇండ్లు మార్కింగ్ చేశామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి మేరకు ప్రతి సోమవారం నిధులు చెల్లించడం జరుగుతుందని అన్నారు. ఆరెంపుల నుండి ఖమ్మం – వరంగల్ ఆర్ అండ్ బి రోడ్డు వయా యన్.డి.ఆర్. గోదాము వరకు 77 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే పశు సంవర్ధక ఉప కేంద్రం నూతన భవనం, ప్రహరీ గోడ, మరుగుదొడ్ల నిర్మాణాలకు,ఎం.పి.పి.ఎస్. ఆరెంపులలో 13.50 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గది నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఆరెంపుల జెడ్పీ పాఠశాల ఆవరణలో ఖమ్మం రూరల్ మండలం, ఎదులాపురం మున్సిపాలిటీ ప్రాంత లబ్ధిదారులకు సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను, నూతన రేషన్ కార్డులను మంత్రి అందజేశారు.
కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు హరినాథ బాబు, వెన్నపూసల సీతారాములు, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపిడివో శ్రీదేవి, ఎంఈఓ శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


