- అధికారులు అనుమతిచ్చినా అడ్డుకుంటున్న ఫారెస్ట్ సిబ్బంది
- పట్టించుకోని అధికార యంత్రాంగం
- అంగూరిగూడెం గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలి
కాకతీయ, మణుగూరు: అడవి బిడ్డలను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకొస్తామని చెబుతున్న ప్రజాప్రతినిధుల మాటలు నీటిమూటలవుతున్నాయని, అనాదిగా అడవి బిడ్డలకు కష్టాలే ఎదురవుతున్నాయని సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన కరకగూడెం మండలం కన్నాయిగూడెం పంచాయతీలోని ఆదివాసీ గ్రామం అంగూరిగూడెం గ్రామాన్ని సందర్శించి గ్రామస్తుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. గిరిజన ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఐటీడీఏ సంస్థను ఏర్పాటు చేసినా గిరిజనుల బతుకులు మాత్రం మారడం లేదన్నారు. దశాబ్దాలుగా అంగూరిగూడెం గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేక గిరిజనులు చీకట్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికీ గిరిజన గ్రామాలకు కరెంటు లేకపోవడం దారుణమన్నారు.
కొందరు అధికారులు స్పందించి, గ్రామానికి వెలుగులు నింపేందుకు విద్యుత్ స్తంభాలు, పరికరాలను గ్రామానికి చేర్చిన కొందరు కిందిస్థాయి ఫారెస్ట్ సిబ్బంది కుటీల యత్నంతో వివక్ష చూపుతూ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ఐటీడీఏ పీవో సమస్యను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించకుంటే కలెక్టర్‌ను నేరుగా కలిసి సమస్యను విన్నవిస్తామని, అవసరమైతే ప్రజా ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. అతి త్వరలోనే గ్రామానికి రోడ్డు కరెంటు, నీళ్ల సౌకర్యం కల్పిస్తానని కర్నె రవి గ్రామస్తులకు హామీ ఇచ్చారు.


