కాకతీయ, కొత్తగూడెం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఎస్ సి సి డబ్ల్యూ ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో మంగళవారం సింగరేణి కాంటాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో జెండాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కొత్తగూడెంలోని రైటర్ బస్తి బాబు క్యాంపులో కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జిలతో జెండాలతో నిరసన చేపట్టారు. కొత్తగూడెం రీజియన్ నాయకులు నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వర్ రావు, కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి ఎన్ సంజీవ్ లు మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. సింగరేణి సంస్థకు వచ్చిన 6094 కోట్ల లాభాల్లో కాంట్రాక్టు కార్మికుల శ్రమ ఉందన్నారు.
సింగరేణి కాంటాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. పర్మినెంట్ కార్మికులకు 1,95,610 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను 5500 ప్రకటించడం అంటే కాంటాక్ట్ కార్మికులను మోసం చేయడమే అని మండిపడ్డారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ప్రాతినిత్య సంఘలు కాంట్రాక్ట్ కార్మికులకు ఏమాత్రం లాభాల వాటా పెంచడానికి ప్రయత్నం చేయలేదన్నారు.
ఏదైనా చేస్తే మేమే చేయాలి అంటూ కాంట్రాక్ట్ కార్మికుల దగ్గరికి వచ్చి మీటింగ్ లు పెట్టే ఏఐటీయూసీ, ఐఎన్టియుసి నాయకులు కాంట్రాక్టు కార్మికుల పక్షాన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కనీసం పదివేల రూపాయలైనా ఎందుకు ఇప్పించలేదో కాంటాక్ట్ కార్మికులకు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు 20వేల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ డివిజన్ నాయకులు కరుణ సంధ్య లక్ష్మి నరసింహ రామకృష్ణ కృష్ణ పాషా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


