కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం, గోళ్లవిడిసిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం .. ఇంట్లో ప్రతిరోజూ పచ్చడి, అన్నం పెడుతున్నారని భార్యతో విభేదాలు జరుగుతుండేవి. ఆదివారం కావడంతో చికెన్ వండమని భార్యను కోరినప్పటికీ ఆమె వండకపోవడంతో భర్త లక్ష్మీనారాయణ (25) తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. వెంటనే పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనను గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి ఏడాదిన్నర వయసున్న బాబు ఉన్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలం, పోతారం గ్రామంలో కూడా ఇలాంటి విషాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా వాసి దశరథ్ (40) కుటుంబంతో కలిసి పోతారం శివారులోని ఒక పౌల్ట్రీ ఫారంలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతనికి డాక్టర్లు చికెన్ తినవద్దని హెచ్చరించారు. అయినప్పటికీ భార్యను చికెన్ వండమని కోరగా, డాక్టర్ల సూచనల కారణంగా ఆమె నిరాకరించింది. దీంతో భర్త,భార్యల మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన దశరథ్ ఆవేశంతో పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు.


