కాకతీయ, కొత్తగూడెం రూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కొత్తగూడెం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా సుదర్శన్ రావు మాట్లాడుతూ చుంచుపల్లి మండలం కొమరం భీం కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదలకు కనీస సౌకర్యాలు, ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని కోరారు. ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న వారికి పర్మినెంట్గా సదుపాయాలు కల్పించాలన్నారు.
కాలనీకి విద్యుత్, తాగునీటి వసతి కల్పించాలని, రోడ్లు కూడా వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అన్నవరపు సత్యనారాయణ, ఏజే రమేష్, భూక్య రమేష్, లిక్కి బాలరాజు, నందిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.


