కాకతీయ, కొత్తగూడెం రూరల్ : చారిత్రక గుట్టలు.. ఎత్తయిన ప్రాంతాలు అక్రమార్కుల దందాతో కనుమెరుగుతున్నాయి.. కొందరు సిండికేట్ గా ఏర్పడి ప్రకృతి సంపదను దర్జాగా కొల్లగొడుతున్న పరిస్థితి నెలకొంది.. ఇసుక దందాను దొంగల ముఠా కొనసాగించడమే కాకుండా కొత్తగా గుట్టలపై కన్నేసి అందులో ఉన్న సంపదను దోచుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని సింగరేణి సెంట్రల్ వర్క్ షాప్ పక్కన ఉన్న బోడ గుట్టను మట్టి దొంగలు తోడేస్తున్నారు. ఎక్స్‌కవేటర్ లతో ఇష్టారాజ్యంగా తవ్వుతూ మట్టితో పాటుగా ఇండ్లకు ఉపయోగించే పునాది రాయిని సైతం యథేచ్చగా తరలించుకుపోతున్నారు. వాల్టా నిబంధనలు, గిరిజన చట్టాలను పాతరేస్తూ యథేచ్ఛగా మొరం దోపిడీని సాగిస్తున్నారు. పగలు, రాత్రి విచ్చలవిడిగా దందా సాగుతున్నా రెవెన్యూ, గనులశాఖ, నిఘా విభాగాలు మీనమేషాలు లెక్కిస్తుండటం అనుమానాలకు దారి తీస్తోంది.
ప్రభుత్వ సంపద తరలిపోతున్నా యంత్రాంగం చోద్యం చూస్తోంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా తెల్లవారుజామున బోడగుట్ట వనరులను నెంబర్ లేని జెసిబి యంత్రంతో తవ్వకాలు చేసి ట్రాక్టర్ల ద్వారా మట్టిని సమీపంలో ఉన్న వెంచర్లకు ఇండ్ల నిర్మాణాలకు తరలిస్తున్నట్లుగా ఆ ప్రాంతానికి చెందిన కొందరు మాట్లాడుకోవడం గమనార్హం.
ట్రాక్టర్ ట్రక్కు మట్టి 2000 నుంచి 3000 వరకు అమ్ముతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. పునాదిరాయి అయితే సైజును బట్టి 4000 నుంచి 10000 దాకా అమ్ముతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత బహిరంగంగా దందా కొనసాగుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి బోడగుట్ట నుండి సంపద తరలిపోకుండా చర్యలు తీసుకోవడంతో పాటు జెసిబి యంత్రాలను ట్రాక్టర్లను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


