కాకతీయ, భద్రాద్రి కొత్తగూడెం రూరల్: సింగరేణి కాలరీస్ కంపెనీలో పనిచేసే ప్రతి ఉద్యోగి నీతి నిజాయితీగా విధులు నిర్వహించాలని సింగరేణి అధికారులు సూచించారు. 3 నెలల పాటు నిర్వహించే విజిలెన్స్ అవగాహన వారోత్సవాలపై మంగళవారం సింగరేణి ప్రధాన కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సింగరేణి యాజమాన్యం అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా జిఎం(విజిలెన్స్) కే. ప్రసాద రావు, జిఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సిఎస్‌ఆర్ జి.వి. కిరణ్ కుమార్, సిఎంపిఎఫ్‌ఓ ఏవై ఆర్‌సి భరత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం మన చేసే ప్రతీ పనిలో నీతి నిజాయితీ పారదర్శకత అవసరం అని ఈ విజిలెన్స్ అవగాహన కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయడం ద్వారా పారదర్శకమైన అవినీతి రహిత దేశాన్ని నిర్మించడం సాధ్యమవుతుందని తెలిపారు.
మన సంస్థలోని ఉద్యోగులందరూ నిబంధనల మేరకు పనిచేస్తూ తమ విధులను నిజాయితీగా నిర్వర్తిస్తూ సంస్థలోని ఉద్యోగులు తమ చుట్టు ప్రక్కల జరిగే అవినీతి అక్రమాలపై ఉదాసీన వైఖరి చూపకుండా సంబంధిత ఉన్నతాధికారులకు ధృష్టికి తీసుకొచ్చి అట్టి వాటిని ప్రారంభదశలోనే అరికట్టే విధంగా కృషి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ లు వంశీధర్ కుసుంభ, ఎం.కనకమ్మ, సిఎంపిఎఫ్ ఆసిస్టంట్ కమిషనర్ పి.చిరంజీవి, డిజిఎం(పర్సనల్)లు కేసా నారాయణరావు, ముకుంద సత్యనారాయణ, విజిలెన్స్ ఆఫీసర్లు డి.వీరయ్య, జి.రాంచందర్, ఎస్‌డి.షాకిర్ మొహినుద్దీన్, గౌసుద్దీన్, సమ్మయ్య, సిఎంపిఎఫ్‌ఓ ఏఓ వి.సులోచన, ఎస్‌ఓలు బి.ఎల్.వెంకటేశ్వర్లు, సీతారాం ఇతర అధికారులు పాల్గొన్నారు.


