కాకతీయ, భద్రాద్రి: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఓ గర్బిణీ అనుభవం గ్రామీణ ఆరోగ్య సదుపాయాల పరిస్థితిని మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది. చర్ల మండలం బట్టిగూడెం గ్రామానికి చెందిన రవ్వ భీమేకి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
కానీ, గ్రామం నుంచి రహదారి లేకపోవడం వారి ముందున్న అతిపెద్ద అడ్డంకిగా మారింది. అంబులెన్స్ బుదరలోకి చేరలేకపోవడంతో, కుటుంబసభ్యులు భీమేకి డోలిలో కట్టుకుని మోసుకెళ్లాల్సి వచ్చింది. సుమారు ఆరు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లేలోపే నొప్పులు పెరిగి, భీమే నడిరోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది.
ప్రసవం పూర్తయ్యాక, తల్లి శిశువును ముందుగా ఆటోలో తరలిస్తుండగా, మార్గమధ్యంలో అంబులెన్స్ చేరింది. వెంటనే వారిని సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు జరిపి తల్లి, శిశువు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండటంపై ఊరంతా ఊపిరి పీల్చుకోగా, మరోవైపు ఇప్పటికీ రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ దూరం నుంచి తిరిగి వెళ్లిపోవాల్సి రావడం మా దురదృష్టం అని గ్రామస్థులు వాపోతున్నారు.


