కాకతీయ, గీసుగొండ: ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పంటలు దెబ్బతినకుండా జాగ్రత్తలు వహించాలని మండల వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ అన్నారు. గొర్రె గుంట రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి పి.హరిప్రసాద్ బాబు ఆధ్వర్యంలో, జాతీయ ఆహార భద్రతా మిషన్ జిల్లా కన్సల్టెంట్ పి.సారంగం రైతులకు అవగాహన కల్పించారు.
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరి, ప్రత్తి, కంది పంటల్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువుల వినియోగం, కలుపు నియంత్రణ, పురుగు మందుల వాడకం గురించి సూచనలు చేశారు. సాధారణ ఎరువులకు బదులుగా నానో ఎరువులు, ద్రవరూప ఎరువులు వాడితే అధిక దిగుబడి సాధ్యమని చెప్పారు.
తరువాత వంచనగిరి, ఊకల్ గ్రామాల్లో ప్రదర్శన క్షేత్రాలను సందర్శించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ డి.రమేష్, వైస్ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారులు సంపత్, రజిని,కావ్యతో పాటు రైతులు పాల్గొన్నారు.


