కాకతీయ, పినపాక: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతోందని మండల బీజేపీ అధ్యక్షుడు ధూళిపూడి శివప్రసాద్ బయ్యారం క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు .
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కేంద్ర బీజేపీ హస్తం లేకుండా ఇళ్ల నిర్మాణం అసాధ్యమని, కేంద్రం ద్వారా ఇందిరమ్మ పథకం కింద రూ.1,70,000, అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.80,000 లబ్ధిదారులకు అందుతోందని వివరించారు. అయినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల సబ్సిడీ తమవల్లనే వస్తోందని చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని మండిపడ్డారు. ప్రజల అమాయకత్వాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.
ఇక, ఆరు గ్యారంటీల్లో చాలా వాగ్దానాలు నెరవేరలేదని, ముఖ్యంగా రైతులకు సంబంధించిన పథకాలు అమలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. యూరియా కొరత సమస్యను ఇప్పటికీ ప్రభుత్వం పరిష్కరించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే సమయంలో, రాష్ట్రంలో బీజేపీకి ప్రజల ఆదరణ రోజురోజుకీ పెరుగుతోందని, రాబోయే అధిక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం గెలుపు దిశగా ఉందని స్పష్టంగా కనిపిస్తుందని శివప్రసాద్ పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా బీజేపీకి ప్రజల మద్దతు బలపడుతుండగా, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ శాసించే రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.


