కాకతీయ,బయ్యారం: గత రెండు రోజుల క్రితం మండలంలో గాలివాన ఈదురుగాలి బీభత్సానికి మండలంలో జగత్రావుపేట, రెడ్యా తండా, బిమ్లా తండా ,బోటి తండా, కొత్తూరు, కోయగూడెం, ఏజెన్సీ గ్రామాలలో చేతికందే దశలో మొక్కజొన్న పంట నేలవాలి పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆదివారం ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశాల మేరకు ,మండల తాహశీల్దార్ నాగరాజు, ఎంపీడీవో విజయలక్ష్మి , వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓ లు సంబంధిత రైతుల వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు.
ప్రభుత్వం తరుపున సంభందిత శాఖ ద్వారా నివేదిక ను పంపించి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని బాధిత రైతులకు హామీ ఇచ్చారు.శనివారం రాత్రి మండలంలో ఏజెన్సీ గ్రామాలలో కురిసిన భారీ వర్షానికి భీమ్లా తండా కొత్తూరు రహదారి మధ్యలో కల్వర్టు కూలిపోవడంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి.
దీనితో కూలిపోయిన కల్వర్టు ప్రాంతాన్ని సందర్శించి మరమ్మతులు జరిగే విధంగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు తాహశీల్దార్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రామచంద్రాపురం గ్రామంలోని రైతు సహకార సబ్ సెంటర్ ను తాహశీల్దార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి, అక్కడి రైతులకు యూరియా కట్టలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఐ తిరుపతి ,బయ్యారం సింగిల్ విండో చైర్మన్ మధుకర్ రెడ్డి ,డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, నాయకులు వెంకటపతి, కిషన్ నాయక్ ,లక్ష్మి, రమేష్ ,వీరన్న వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.


