కాకతీయ, వెంకటాపురం: ఆపరేషన్ కగార్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా హెలికాప్టర్లు, 35 వేల మంది సైన్యంతో గిరిజనులను ఇబ్బందులకు గురిచేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీలోని గిరిజనుల రవాణా సౌకర్యం కోసం 100 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ 100 కోట్లు కేటాయించకపోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే, సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడుజూలకంటి రంగారెడ్డి ఎద్దేవా చేశారు. యాకన్న గూడెం నుండి వెంకటాపురం వరకు అధ్వానంగా ఉన్న రోడ్డు నిర్మాణానికి రూ 100 కోట్లు కేటాయించాలని సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఆదివారం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ పాదయాత్ర యాకన్నగూడెం నుండి 32 కిలోమీటర్లు సాగింది.
ఈ పాదయాత్రలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొనగా పాదయాత్ర ముగింపు సభ అంబేద్కర్ సెంటర్లో గ్యానం వాసు అధ్యక్షతన జరిగింది. సభలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. ఇసుక దోపిడీపై ఉన్న ఆసక్తి గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వానికి లేదని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల నుండి ప్రతినిత్యం 60, 50 టన్నుల బరువుతో వందలాది లారీలు ప్రయాణం చేస్తున్నాయన్నారు. అధిక బరువు వల్ల భద్రాచలం నుండి వెంకటాపురం 100 కిలోమీటర్ల మేర రహదారి అధ్వానంగా తయారయింది అన్నారు. గుంతలో పడి ద్విచక్ర వాహనదారులు, ఆటోవాలాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు.
ఏజెన్సీలోని ఇసుక రవాణా ద్వారా ప్రభుత్వానికి ప్రతిరోజు రూ కోటికి పైగానే ఆదాయం సమకూర్తుందన్నారు. ఇంత ఆదాయం వస్తున్న ఛత్తీస్గడ్ సరిహద్దు రాష్ట్రంలో ఉన్న జిల్లాకు రోడ్డు మరమ్మత్తుల కోసం నిధులు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. భద్రాద్రి అభివృద్ధి బీఆర్ఎస్ తోకాదు అని, ఆ పార్టీ నుంచి గెలుపొందిన భద్రాద్రి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఏజెన్సీ ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లా ప్రాంతంలో ఉన్న 65 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి, ములుగు జిల్లాలో ఉన్న 32 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ 100 కోట్లు కేటాయించాలని సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్రలు చేస్తుందన్నారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడేది ఎర్రజెండానని గుర్తు చేశారు.
ఎర్ర జెండాకు పదవులు ముఖ్యం కాదని ప్రజా సమస్యలే ప్రత్యేక ఎజెండా అని తెలిపారు. రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని పోరాటాలు చేస్తూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, ఎంపీ బలరాం నాయక్, ఇన్చార్జ్ మంత్రి సీతక్క ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతంలో సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాన్ని రోడ్ల భవనాలశాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటానికి వెంకటాపురం గ్రామ ప్రజల నుండి మంచి స్పందన లభించిందన్నారు.
రోడ్ల అధ్వానానికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో గత నెలలో వెంకటాపురం బంద్ కు పిలుపునిస్తే వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి పోరాటానికి మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, సిపిఎం మండల కార్యదర్శి గ్యానం వాసు, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి శ్రీను, వంకా రాములు, చారి, జజ్జరి దామోదర్, సాధనపల్లి దేవమణి, పరిశిక రాంబాబు, మాణిక్యం, తోట నాగేశ్వరావు, శ్రీను, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


