కాకతీయ, బయ్యారం : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అభ్యర్థులను గెలిపించటం ద్వారా పేదల హక్కులకు రక్షణ కలుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరి మధు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం అల్లిగూడెంలో ఏజెన్సీలో పార్టీ ముఖ్య నాయకుల జనరల్ బాడీ సమావేశం బానోత్ నర్సింహ అధ్యక్షతన నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా ఆవునూరి మధు హాజరై మాట్లాడారు.
నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో నియంతృత్వ ఫాసిస్టు విధానాలు అమలు జరుగుతున్నాయని, ఆపరేషన్ కగార్ పేర ఆదివాసీలను, మావోయిస్టులను వందల సంఖ్యలో హతమారుస్తున్నారని అన్నారు. కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసమే మోడీ ప్రభుత్వం నెత్తురు టేరులను పారిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపకుండా వాయిదా వేస్తూ వస్తున్నదని, దాంతో గ్రామాల అభివృద్ధి కుంటు పడిందని అన్నారు.
హై కోర్టు ఆదేశించినా స్థానిక ఎన్నికలు జరపకుండా వాయిదా వేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజల వ్యతిరేకతనుఎదుర్కొంటున్నదని, అందుకే స్థానిక ఎన్నికలు జరపటానికి భయపడుతున్నదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులు హరిస్తున్నాయని, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం విప్లవ పార్టీ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీని ప్రజలు ఆదరించాలని కోరారు.
పార్టీ శ్రేణులు స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జనరల్ బాడీలో పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు, పార్టీ బయ్యారం మండల కార్యదర్శి మోకాళ్ళ మురళీ క్రిష్ణ, పార్టీ జిల్లా నాయకులు యాకన్న, పూనెం బిక్షం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాదంశెట్టి నాగేశ్వరరావు, మేకపోతుల నాగేశ్వరరావు, బానోత్ హోలీ, తదితరులు పాల్గొన్నారు..


