సీఎంగా లోకేష్… రాష్ట్రపతి అభ్యర్థిగా చంద్రబాబు
పొలిటికల్ సర్కిల్‌లో తెగ చర్చ.. ఏపీ పాలిటిక్స్ మారనున్నాయా..?
కాకతీయ,నేషనల్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు మరి కొద్దిరోజుల్లో సీఎం పదవీ బాధ్యతలు లోకేష్‌కు అప్పగించనున్నారా..? లోకేష్‌ను సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నారా..? అదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ చంద్రబాబును దేశ అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమవుతోందా.? అంటే అటు ఏపీ, ఇటు ఢిల్లీలో రాజకీయ వర్గాల్లో దీనిపై ఆసక్తికర పొలిటికల్ గాసిప్ చర్చ నాయకుల మధ్య జరుగుతోందంట. తన అత్యుత్తమమైన అడ్మినిస్ట్రేషన్ విధానాలతో నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. నవ్యాంధ్రపై తనదైన ముద్ర వేస్తున్న చంద్రబాబుకు దేశ వ్యాప్తంగా విజన్ ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది. ఎన్డీఏ నుంచి పూర్తి సపోర్ట్‌తో నవ్యాంధ్రను అభివృద్ధిలో శర వేగంగా ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రధాన మంత్రి మోదీతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో కూడా చంద్రబాబును విజన్ ఉన్న నాయకుడిగా..తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశ పెట్టిన పథకాలు.. ఐటీ, టెక్నాలజీపై దూరదృష్టి నేటి తెలుగు రాష్ట్రాలు ఈ రంగాల్లో ముందుండడానికి కారణాలంటూ విశ్లేషించారు.
లోకేష్‌కు సీఎం బాధ్యతలు..!
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో కలిసి తిరుగులేని రాజకీయ శక్తిగా కనిపిస్తోంది. నమ్మదగిన రాజకీయ మిత్రుత్వ పార్టీగా జనసేనను చంద్రబాబు విశ్వసిస్తున్నారంట. అదే సమయంలో తన వయస్సు రీత్య కూడా.. ప్రత్యక్ష్య రాజకీయాలకు బాబు గుడ్ బై చెబుతారని, లోకేష్‌ను ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోందంట.సమీప భవిష్యత్‌లోనే చంద్రబాబు సీఎం పదవీ బాధ్యతలు, తెలుగుదేశం పార్టీ పగ్గాలను కుమారుడు లోకేష్‌కు అప్పగిస్తారన్న చర్చ జరుగుతుండటం గమనార్హం. వాస్తవానికి ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థిగా బాబు ఉంటారన్న చర్చ విపరీతంగా జరిగింది. అయితే అందులో వాస్తవం లేదని తేలిపోయింది. దీనికి చంద్రబాబు సున్నితంగా తిరస్కరించి ఉంటారన్నది ఎక్కువ మంది విశ్లేషకుల అభిప్రాయం. అయితే అదే సమయంలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా చంద్రబాబును నిలిపే అవకాశం ఉంటుందని, ఈ ప్రాతిపాదన నిజమైతే..చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందన్న విశ్లేషణలు ఇటు ఏపీ అటు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయంట. పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్న చర్చ.. గాసిప్‌గా మిగిలిపోతుందా.. లేక నిజమవుతుందా అన్నది వేచి చూడాలి.!!


