కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సొంత పార్టీ నేతలు మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలు పార్టీ లోపల తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. కవిత తీరుతో పార్టీకి జరిగే నష్టం దృష్ట్యా, ఆమెను సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశముందని బీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.
కవిత వ్యాఖ్యల అనంతరం, కేటీఆర్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌లో సమావేశమయ్యారు. అక్కడ జరిగిన చర్చలో మెజారిటీ నేతలు, కవితను కొనసాగిస్తే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని, విపక్షాలకు బలం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. కవితపై చర్యలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదని నేతలందరూ ఒకే సారిగా సూచించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, బీఆర్‌ఎస్ ఐటీ విభాగం నుంచి కార్యకర్తలకు కవితను వెంటనే సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో, అనేకమంది కార్యకర్తలు ఆమెను ఎక్స్ లో అన్‌ఫాలో చేస్తూ, విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. పార్టీలోనూ, మీడియా వేదికలపైనా కవిత వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు నేతలు గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పరాజయానికి కవిత తీరే ప్రధాన కారణమని సూటిగా ఆరోపించారు. మరికొందరు ఆమె వెంటనే పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంతలో, కవిత పీఆర్వోను బీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడం కూడా పార్టీ లోపలి అసంతృప్తిని బహిర్గతం చేసింది. మరోవైపు, హరీశ్‌రావును “ఆరడుగుల బుల్లెట్” అంటూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం ప్రత్యేక పోస్టులు విడుదల చేయడం గమనార్హం.
అయితే, కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆమె తదుపరి అడుగులు ఎటువైపు ఉంటాయనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, కవిత బీఆర్‌ఎస్ నుంచి బయటకు వస్తే, ఇప్పటికే బలోపేతం చేస్తూ వస్తున్న తెలంగాణ జాగృతినే రాజకీయ వేదికగా మార్చే అవకాశం ఎక్కువ. కొత్త పార్టీ పేరుకన్నా “జాగృతి” పేరునే కొనసాగించే అవకాశముందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద, కవిత వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌లో సంక్షోభం ముదురుతోంది. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.


