చదివిన వెంటనే మెసేజ్ మాయం
వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్
15 నిమిషాల్లో చాట్ ఆటో డిలీట్
ఓపెన్ చేయకపోతే 24 గంటల తర్వాత అదృశ్యం
బ్లూ టిక్స్ ఆఫ్ ఉన్నా పని చేస్తుంది
డిసప్పీరింగ్ మెసేజెస్‌కు భిన్నం
యూజర్ల డేటా భద్రతే లక్ష్యంగా కొత్త ఫీచర్
కాకతీయ, స్పెషల్ డెస్క్: చదివిన కొద్దిసేపటికే మెసేజ్ స్వయంగా మాయమయ్యే కొత్త ఫీచర్‌ను వాట్సప్ తీసుకురానుంది. యూజర్ల ప్రైవసీని మరింత బలోపేతం చేయడమే ఈ ఫీచర్ లక్ష్యమని తెలుస్తోంది. ‘ఆఫ్టర్ రీడింగ్’ పేరుతో రూపొందిస్తున్న ఈ ఫీచర్లో మెసేజ్ ఓపెన్ చేసిన వెంటనే టైమర్ ప్రారంభమవుతుంది. 15 నిమిషాలు పూర్తయ్యాక ఆ మెసేజ్ పంపినవారి, అందుకున్నవారి చాట్ హిస్టరీ నుంచి పూర్తిగా అదృశ్యమవుతుంది. దీంతో మాన్యువల్‌గా డిలీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మెసేజ్‌ను గ్రహీత ఓపెన్ చేయకపోతే అది 24 గంటల పాటు అలాగే ఉంటుంది. ఆ తర్వాత స్వయంగా డిలీట్ అవుతుంది. ముఖ్యంగా ఓటీపీలు, బ్యాంక్ పాస్వర్డ్లు, వెరిఫికేషన్ కోడ్స్, అడ్రస్ లేదా లొకేషన్ వంటి సున్నితమైన సమాచారాన్ని పంపేవారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది.
భద్రతకు ప్రాధాన్యం
చాట్‌లో సున్నితమైన సమాచారం ఎక్కువసేపు ఉండటం వల్ల గోప్యతకు ముప్పు పెరుగుతుంది. ఈ కొత్త ఫీచర్‌తో డేటా సురక్షితంగా ఉంటుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. వాట్సప్‌లో బ్లూ టిక్స్ ఆఫ్ చేసినా ఈ ఫీచర్ పనిచేస్తుంది. మెసేజ్ చదివిన వెంటనే టైమర్ ప్రారంభమవుతుంది. బ్లూ టిక్స్ కనిపించకపోయినా మెసేజ్ డిలీట్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఉన్న డిసప్పీరింగ్ మెసేజెస్ ఫీచర్లో 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజుల తర్వాత మెసేజ్‌లు డిలీట్ అవుతాయి. అయితే ఆఫ్టర్ రీడింగ్ ఫీచర్లో మెసేజ్ చదివిన తర్వాత 15 నిమిషాల్లోనే తొలగిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉండగా, త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


