మార్కాపురంలో ఘెర బస్సు ప్రమాదం… 14 మంది సజీవదహనం
హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న బస్సులో దుర్ఘటన
టిప్పర్‌ను ఢీకొనడంతో చెలరేగిన మంటలు
మృతుల్లో మహిళలు, చిన్నారులు సహా పలువురు మృతి
15 మందికి తీవ్ర గాయాలు… ఆసుపత్రికి తరలింపు
కాకతీయ,ఏపీబ్యూరో : ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రాయవరం వద్ద టిప్పర్‌ను ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనలో 14 మంది సజీవదహనం కావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారు కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందినవారిగా తెలుస్తోంది. ఒక్కసారిగా అగ్ని చెలరేగడంతో ప్రయాణికులు బయటకు రావడానికి అవకాశం లేకపోయింది. కొన్ని నిమిషాల్లోనే బస్సు మంటల్లో కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన 10 మంది ప్రయాణికులు బస్సు నుంచి బయటకు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి గుర్తింపు ప్రక్రియ ప్రారంభించారు. మృతుల కుటుంబాలకు సహాయం అందించేందుకు, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.


