గల్ఫ్‌లో తెలుగువారికి అండగా ఏపీ ప్రభుత్వం
యుద్ధ వాతావరణంపై అప్రమత్తత
విమానాశ్రయాల్లో ఉన్నవారిని సురక్షితంగా తరలించేందుకు చర్యలు
ఏపీ ఎన్ఆర్ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఎంబసీ సేవలు వినియోగించుకోవాలని సూచన
హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల
కాకతీయ, ఏపీ బ్యూరో : ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా దేశాల్లో ఉన్న తెలుగువారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్ ఆర్ ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొన్ని దేశాల్లో విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. విదేశాల్లో చిక్కుకున్న ప్రతి తెలుగు వ్యక్తిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

కోఆర్డినేటర్లకు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ద్వారా గల్ఫ్ దేశాల్లో ఉన్న కోఆర్డినేటర్లను అప్రమత్తం చేసినట్లు మంత్రి వెల్లడించారు. సమస్యల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు తక్షణ సహాయం అందించేందుకు స్థానిక స్థాయిలో సమన్వయం కొనసాగుతోందన్నారు. అవసరమైన సమాచారాన్ని సేకరించి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని చెప్పారు. స్థానికంగా ఉన్న తెలుగు కుటుంబాల సహకారంతో తాత్కాలిక వసతి, భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఆహారం, నివాసం వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఎన్నార్టీ అధికారులు కోఆర్డినేటర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఇండియన్ ఎంబసీలతో కూడా సమన్వయం కొనసాగుతోందని, అవసరమైతే వారి సేవలను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ప్రభుత్వాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో
గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తమ వివరాలను క్రింది ఏపీ ఎన్నార్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ 0863-2340678, వాట్సాప్: +91 85000 27678 నెంబర్లకు తెలియజేయవచ్చని, ఈమెయిల్: helpline@apnrts.com లకు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు వెంటనే సంప్రదించి సహాయం పొందవలసిందిగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.


