కాంగ్రెస్ హామీల్లో పూర్తిగా వైఫల్యం- వంటేరు ప్రతాప్ రెడ్డి
– హైదరాబాద్ బ్రాండ్‌కు దెబ్బతీస్తున్న రేవంత్ పాలన
– మూసీ పేరిట లక్షా 40 వేల ఇండ్ల కూల్చివేత యత్నం
– పేదల జీవితాలతో చెలగాటం మానుకోవాలి
కాకతీయ, గజ్వేల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందిందని గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం నిలిచిపోయాయని విమర్శించారు. తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. హైడ్రా చర్యలు, మూసీ నది ప్రక్షాళన పేరుతో సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. మూసీ నది అభివృద్ధి పేరుతో లక్షా 40 వేల ఇళ్లను కూల్చేందుకు ప్రభుత్వం పూనుకుందని, దీనివల్ల లక్షల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లపైనే చర్యలు తీసుకుంటూ, పెద్ద హోటళ్లు, రిసార్ట్‌లపై చర్యలు లేవని ఆరోపించారు. ధనవంతులతో సెటిల్మెంట్ రాజకీయాలు సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగుతోందని అన్నారు. రేవంత్ రెడ్డి విధానాల వలన హైదరాబాద్‌లో వ్యాపార రంగం దెబ్బతిన్నదని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారని తెలిపారు. మెట్రో విస్తరణలో పురోగతి లేదన్నారు. లార్సెన్, టూబ్రో సంస్థపై ఒత్తిడి తెచ్చి వసూళ్ల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ సంస్థకు చెందిన భూములను విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం విస్మరించిందని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కక్షపూరిత రాజకీయాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. పేదల జీవితాలతో చెలగాటమాడిన ఏ ప్రభుత్వం కూడా నిలబడదని హెచ్చరించారు.


