విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
ఏఈ మహేష్‌కు సర్పంచ్ భూక్యా మోహన్ వినతి
కాకతీయ, వేములవాడ : వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం దేవుని తండాలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ భూక్యా మోహన్ డిమాండ్ చేశారు. సోమవారం చందుర్తి మండల విద్యుత్ శాఖ ఏఈ మహేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తండాలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ పనులకు సంబంధించి కొత్త డిపిఆర్ సిద్ధం చేయాలని కోరారు. తండాలో విద్యుత్ స్తంభాలు లేని ప్రాంతాలను గుర్తించి వెంటనే కొత్త పోల్స్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ వినతిపై ఏఈ మహేష్ సానుకూలంగా స్పందించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని, త్వరలోనే స్తంభాల ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు భూక్యా గబ్బర్ సింగ్, తండా ప్రముఖులు పాల్గొన్నారు.


