సహజ రంగులతోనే హోలీ జరుపుకోవాలి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గణపతి
కాకతీయ, గజ్వేల్ : హోలీ సందర్భంగా గుడ్లు, టమోటాలు వంటి ఆహార పదార్థాలను వృథా చేయవద్దని గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ గణపతి పేర్కొన్నారు. కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం నేషనల్ సర్వీస్ స్కీం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణ హిత హోలీ జరుపుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. రసాయనిక రంగుల హానికర ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సహజ రంగులతోనే హోలీ జరుపుకోవాలి. పండుగల పేరుతో ఆహారాన్ని వృథా చేయడం సమంజసం కాదు. సురక్షితంగా, బాధ్యతాయుతంగా పండుగలు జరుపుకోవాలి అని సూచించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల పూలతో సహజ రంగులు తయారు చేశారు. తయారీ విధానాన్ని వివరించి ప్రదర్శించారు. సృజనాత్మకత కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. డా. ఎం. అలివేలు మాట్లాడుతూ హోలీ పండుగ సంప్రదాయ ప్రాముఖ్యతను వివరించారు. పూర్వకాలంలో పూలు, ఔషధ మొక్కలతో తయారు చేసిన సహజ రంగులనే వినియోగించేవారని తెలిపారు. అవి ఆరోగ్యానికి, పర్యావరణానికి హితమని చెప్పారు. రసాయన రంగులు చర్మ సమస్యలు, పర్యావరణ కాలుష్యానికి కారణమవుతాయని వివరించారు. విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సహజ రంగుల తయారీలో ఉపయోగించే కొన్ని మొక్కల పూలు అలర్జీకి దారితీసే అవకాశముందని తెలిపారు. ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ గణపతి, డా. ఎం. అలివేలు, విజయ భాస్కర్ రెడ్డి, డా. ఎం. భావాని, డా. ఎస్. మహేందర్, డా. ఆర్. మహేందర్ రెడ్డి, డా. జ్యోతి, సి.హెచ్. భావాని తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


