ఈ నెల 28న నేషనల్ లోక్ అదాలత్
రాజీమార్గమే రాజమార్గం అంటూ ముందుకు రావాలని పిలుపు
పెండింగ్ కేసులకు త్వరిత పరిష్కారానికి ఇదే మంచి అవకాశం
మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి సూచన
కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఈ నెల 28న నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసులను పరస్పర అవగాహనతో పరిష్కరించుకునేందుకు ఇదే మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ కేసులు, చిన్నపాటి వివాదాలు, ఎక్సైజ్ కేసులు, కుటుంబ ఆస్తి తగాదాలు వంటి అంశాల్లో రాజీ సాధ్యమయ్యే కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు. దీని ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని వివరించారు. ముఖ్యంగా ఇరు పక్షాలకు శాశ్వత పరిష్కారం లభించి, గ్రామాల్లో శాంతి సామరస్యం నెలకొంటుందని చెప్పారు.
రాజీతోనే శాశ్వత పరిష్కారం
“రాజీమార్గమే రాజమార్గం” అనే భావనతో ముందుకు వచ్చి తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని మండల ప్రజలకు సూచించారు. కోర్టు చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయకుండా, ఒకే వేదికపై సమస్యలు ముగించుకోవడం అందరికీ మేలు చేస్తుందని అన్నారు.మరింత సమాచారం, సలహాల కోసం తమ గ్రామ పోలీసు అధికారిని లేదా కేశవపట్నం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై సూచించారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


