అంబేద్కర్ విగ్రహ ధ్వంసం… కఠిన చర్యలకు డిమాండ్
కాకతీయ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ వార్డు నెం.18 కల్చివాడ ఎస్సీ కాలనీలో డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయబడిన ఘటన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘటనపై మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఫిబ్రవరి 24న గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేసి, చుట్టూ ఉన్న నిర్మాణాన్ని కూడా పాడుచేశారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం.93/2026గా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే కాకుండా సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యగా ఈ ఘటనను ఆయన అభివర్ణించారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని, ఘటనకు ఉపయోగించిన వాహనం సహా అన్ని ఆధారాలను స్వాధీనం చేసుకోవాలని కోరారు.
ధ్వంసమైన విగ్రహాన్ని తక్షణమే పునఃప్రతిష్ఠించి శాశ్వత నిర్మాణంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడే దిశగా పరిపాలన యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.


