రాజకీయంగానే కేసులు నమోదు చేశారు”
-బీఆర్ఎస్ నాయకులు
కాకతీయ, రామకృష్ణాపూర్ : రాజకీయంగా ఎదురుకోలేకనే పలు విధాలుగా కేసులు నమోదు చేశారని పట్టణ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును పట్టణ బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాత 12 కేసులను కొత్తగా వెలుగులోకి తెచ్చి పీటి వారెంట్ జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి హోదాలో ఉండి అధికారాన్ని అడ్డుపెట్టుకొని నగదు ఏరవేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మున్సిపాలిటీ పరిధిలో బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 163 అమల్లో ఉండగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు వస్తున్నప్పటికీ పోలీసులు చూసి చూడకుండా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారిందన్నారు. ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జరిగిన పరిణామాలపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరిపి నిజా నిజాలను నిర్ధారించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


