“మా జీవితాలు బుగ్గి కావాలా..?” ఆనందాపురంలో గిరిజనుల ఆవేదన
అగ్రకుల ఆధిపత్యంపై సర్పంచ్ సమ్మయ్య ఆగ్రహం
నాలుగు ఎకరాల భూమి అక్రమ పట్టాల ఆరోపణలు
రెవెన్యూ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా
న్యాయపోరాటానికి సిద్ధమంటున్న గ్రామస్థులు
కాకతీయ, మణుగూరు/అశ్వాపురం : “అగ్రకుల ఆధిపత్యంలో మా జీవితాలు బుగ్గి కావాలా… ఇంకా ఎన్నాళ్లు ఈ చెర?” అంటూ ఆనందాపురం గ్రామంలో గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ ముర్రం సమ్మయ్య ఆధ్వర్యంలో శనివారం గ్రామస్థులు రోడ్డు బెటాయించి ధర్నా నిర్వహించారు. సమ్మయ్య మాట్లాడుతూ గత నలభై ఏళ్లుగా గ్రామంలో అధికార పార్టీకి చెందిన ప్రభావశీలులు ప్రజా ప్రతినిధులుగా చలామణి అవుతూ గిరిజన కుటుంబాలకు చెందిన నాలుగు ఎకరాల భూమిని బెదిరింపులతో ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమ కుల పెద్దలను భయపెట్టి భూమిపై అడుగుపెట్టనివ్వలేదని, అనంతరం అక్రమ పట్టాలు పొందారని చెప్పారు. ఈ విషయంపై ప్రశ్నించగానే తమపై కేసులు బనాయించి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. భూమి తమదేనని రెవిన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పందనలేదన్నారు. గిరిజనుడు సర్పంచ్‌గా ఎన్నిక కావడం కొందరికి నచ్చలేదని, అందుకే కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ భూములు తిరిగి అప్పగించేవరకు పోరాటం ఆగదని, అవసరమైతే ఐటిడిఎ అధికారులు, జిల్లా కలెక్టర్‌ను కలిసి న్యాయపోరాటానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు. “మా భూములను వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని గిరిజనులు హెచ్చరించారు.


