కారేపల్లిలో ‘మంచి దొంగ’
పేదోడి కన్నీరు చూసి కరిగిన దొంగ మనసు
దోచుకున్న బంగారం, వెండి, నగదు గుమ్మం ముందు పెట్టివెళ్లిన వైనం
బాధిత కుటుంబంలో ఆనంద భాష్పాలు
అసలు కారణం ఏంటి? దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు
కాకతీయ, కారేపల్లి: కఠినంగా మారిపోయిందనుకుంటున్న కాలంలో మానవత్వం మళ్లీ మెలుకువ వచ్చిందనిపించే ఘటన కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తులు, పేద కుటుంబం ఆవేదన చూసి మనసు మార్చుకుని దోచుకున్న సొత్తును తిరిగి యజమాని గుమ్మం వద్దే ఉంచి వెళ్లడం గ్రామంలో చర్చనీయాంశమైంది. చీమ్న తండాకు చెందిన గుగులోత్ వీరు సాధారణ కూలీ. ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టుకున్న తులం బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, 10 వేల రూపాయల నగదు బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అది కేవలం సొమ్ము కాదు, ఆ కుటుంబం భవిష్యత్తు. సర్వస్వం కోల్పోయామనే బాధతో కుటుంబం కన్నీటి పర్యంతమవ్వడం గ్రామస్తులను కలచివేసింది. దొంగతనం జరిగిన వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గురువారం అర్ధరాత్రి నిశ్శబ్దంగా అదే ఇంటి వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు, దోచుకున్న సొత్తును ఒక కవర్‌లో భద్రంగా చుట్టి గుమ్మం ముందు ఉంచి వెళ్లిపోయారు. ఉదయం లేచి చూసిన కుటుంబ సభ్యులు తమ సొత్తు తిరిగి రావడంతో ఆశ్చర్యంతో పాటు ఆనంద భాష్పాలు కార్చారు. ఈ ఘటన మండలవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. బాధితుల పేదరికం చూసి దొంగల మనసు కరిగిందా? లేక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో దొరికిపోతామనే భయంతో తిరిగి ఇచ్చేశారా? లేక గ్రామంలో అనుమానాలు పెరగడంతో పరిచయస్తులే మనసు మార్చుకున్నారా? అన్న అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సొత్తు తిరిగి వచ్చినా చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. “మా కష్టం మాకు తిరిగి వచ్చింది” అంటూ బాధిత కుటుంబం దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. నేరం నేరమే అయినా, నేరస్థుల్లో మిగిలిన ఈ కొద్దిపాటి మానవత్వం గ్రామస్తులను ఆశ్చర్యపరుస్తోంది.


